Monday, December 27, 2010

తలనొప్పి తగ్గాలంటే

 తలనొప్పి తగ్గాలంటే


తలనొప్పి తగ్గాలంటే... దాల్చిన చెక్కను నీటిలో అరగదీసి దానిని పలుచటి లేపనంగా నుదిటిపై రాయాలి. ఆరిన తర్వాత కడిగి మళ్లీ రాయాలి. ఇలా నాలుగు సార్లు చేస్తే నొప్పి మాయమవుతుంది.

Wednesday, December 22, 2010

కందిపోయే అందం

కందిపోయే అందం
న శరీరం యావత్తూ కణాలతోనే నిర్మింతమైంది. ఈ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని శక్తిమంతంగా ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో భాగంగా 'ఫ్రీరాడికల్స్‌' అనే విశృంఖల కణాలు పుడతాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంటాయి. దీన్నే 'ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌' అంటారు. ఈ ఒత్తిడి తగ్గాలంటే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల వంటి సహజమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఒంట్లో ఫ్రీరాడికల్స్‌ ఎక్కువైన కొద్దీ.. కణ క్షీణత పెరిగి.. మన అందం, యవ్వన ఛాయలు కూడా క్షీణించిపోయి.. ముసలి రూపు వచ్చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి అందం చెడకూడదంటేసహజమైన ఆహారంపై దృష్టిపెట్టాలి.

Tuesday, December 21, 2010

పురుగు మందులు: తెలివికి తెగులు!

పురుగు మందులు: తెలివికి తెగులు!
వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో పాటే అవి మోసుకొచ్చే దుష్ప్రభావాలూ విస్తరిస్తున్నాయి. దీర్ఘకాలం పురుగు మందుల ప్రభావానికి గురయ్యే వారిలో విషయ గ్రహణ శక్తి లోపిస్తున్నట్టు ఫ్రాన్స్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా ద్రాక్ష తోటల్లో పురుగు మందులను విపరీతంగా వినియోగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ద్రాక్ష తోటల్లో 20 ఏళ్లుగా పని చేస్తున్న వారిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. రకరకాల పరీక్షలతో వారి తెలివితేటలు, స్పందన-ప్రతిస్పందన తీరుతెన్నులను పరిశీలించారు. పురుగు మందుల ప్రభావానికి నేరుగా గురయ్యే వారిలో.. అంటే పురుగు మందులను కలపటం, చల్లటం వంటి పనులు చేసే వారిలో విషయగ్రహణ శక్తి బాగా తగ్గుతున్నట్టు తేలింది. ఇందులో కొద్దిపాటి లోపం ఉన్నా అల్త్జెమర్స్‌, డిమెన్షియా వంటి మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Monday, December 20, 2010

ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!

'ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!
ఒక వయసు వచ్చేసరికి వినికిడి శక్తి కొంత తగ్గటం సహజమే. చెవులలోని అత్యంత సున్నితమైన వినికిడి యంత్రాంగంలో క్షీణతతో పాటు... దీనికి మరికొన్ని అంశాలూ తోడవుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
భారీ శబ్దాల బారినపడటం, పోషకాహార లోపం, ముక్కు-చెవులలో ఇన్‌ఫెక్షన్ల వంటి వివిధ అంశాలు వినికిడి శక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వృద్ధాప్యంలో వినికిడి మందగించి, చెవుడు ముంచుకురావటానికి ఫోలేట్‌ (ఫోలిక్‌ యాసిడ్‌), బి12 విటమిన్ల లోపం కూడా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు.ఒకే వయసు వృద్ధుల్లో మామూలుగా శబ్దాలు వినగలిగే వారితో పోలిస్తే వినికిడి లోపం ఉన్నవారి రక్తంలో 'ఫోలిక్‌ యాసిడ్‌' స్థాయులు తక్కువగా ఉంటున్నట్టు నైజీరియాలోని ఇబదాన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ 35 శాతం తక్కువగా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినబడనంతగా చెవుడు ఉంటున్నట్టు గుర్తించారు. ఫోలేట్‌తో పాటు కొద్ది మోతాదులోనైనా 'విటమిన్‌ బి12' లోపం కూడా దీనికి కారణమవుతోంది. ఈ లోపాలను చాలా తేలికగా మందులతో, మాత్రలతో సరిచేయొచ్చని పరిశోధకులు గుర్తించటం విశేషం. ఫోలేట్‌, బి12 విటమిన్లను ఇచ్చినప్పుడు వినికిడి మెరుగుపడటమే కాకుండా... జ్ఞాపకశక్తి పెరగటం, కాళ్లూ చేతుల్లోని నాడుల పని తీరుతో పాటు కేంద్ర నాడీ మండల వ్యవస్థ కూడా శక్తిని పుంజుకుంటున్నట్టు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వయసు మీదపడుతున్న కొద్దీ సంప్రాప్తించే చెవుడు సమస్యను సరిచేయటం సాధ్యం కాదనే చిరకాల నమ్మకాన్ని ఇది మార్చేస్తుందని.. ఆ లోపాన్ని అధిగమించేందుకు కొందరికైనా ఇది మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

Sunday, December 19, 2010

కీళ్లవాతానికి ఉల్లితో చెక్‌!

కీళ్లవాతానికి ఉల్లితో చెక్‌!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు! అంతటి శక్తిమంతమైన ఉల్లి ప్రయోజనాల జాబితాలో తాజాగా మరో అంశం చేరింది. తీసుకునే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి అధికంగా ఉండేలా చూసుకుంటే కీళ్లవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఆరోగ్యంగా ఉన్న వెయ్యిమంది కవలలపై లండన్‌లోని కింగ్స్‌ కళాశాల పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వారు తీసుకుంటున్న ఆహారాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. మిగిలిన వారితో పోలిస్తే ఆహారంతోపాటు ఉల్లి, వెల్లుల్లిని తీసుకున్న వారిలో కీళ్లవాతం ముప్పు లక్షణాలు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య వయస్సులో ఉన్న చాలా మంది కీళ్లవాతం బారిన పడుతున్నారు. మోకాళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో నొప్పితో శారీరకంగానేకాదు.. మానసికంగానూ సతమతమవుతున్నారు. ఇలాంటి మొండివ్యాధికి మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవడానికి తాజా పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయి''అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఫ్రాన్సిస్‌ విలియమ్స్‌ తెలిపారు. అధ్యయనానికి బ్రిటన్‌ కీళ్లవాత పరిశోధనసంస్థ నిధులు సమకూర్చినట్లు చెప్పారు.

Wednesday, December 15, 2010

లవంగ మొగ్గ

లవంగ మొగ్గ

సాలా దినుసుల్లో కాస్త ఘాటైన లవంగం.. సహజసిద్ధ ఆరోగ్యప్రదాయిని. దీనిలో మన శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. లవంగాల్లోని ఫెనోల్‌ సమ్మేళనాలు శరీరంలోని విషతుల్యాలను నిర్వీర్యం చేయటంలోనూ ముందుంటాయి. కణ క్షీణతను, కణ నష్టాన్ని తగ్గిస్తాయి. కాబట్టి లవంగాలను -మితంగా- తీసుకోవటం మంచిది!

Tuesday, December 14, 2010

నిత్యం ఆస్పిరిన్‌: కొత్త ప్రయోజనాలు

నిత్యం ఆస్పిరిన్‌: కొత్త ప్రయోజనాలు
క వయసు వచ్చిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు రోజూ తక్కువ డోసు ఆస్పిరిన్‌ మాత్రలు వేసుకోవటం ద్వారా గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలను చాలా వరకూ నివారించుకోవచ్చని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చాలామంది ఈ మాత్రలు వేసుకుంటున్నారు కూడా. తాజాగా దీనితో మరో అదనపు ప్రయోజనం కూడా చేకూరుతోందని పరిశోధకులు గుర్తించారు. నిత్యం తక్కువ డోసులో ఆస్పిరిన్‌ వేసుకునే వారికి.. క్యాన్సర్‌ ముప్పు కూడా బాగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన వారంతా నిత్యం వేసుకోవటం మంచిదన్న అభిప్రాయమూ బలంగా వినపడుతోంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా రోజూ ఆస్పిరిన్‌ తీసుకుంటే పొట్టలో రక్తస్రావం అయ్యే ముప్పు ఎక్కువన్న వాదన ఇప్పటికే బలంగా ఉన్న నేపథ్యంలో.. దీన్ని పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో, వారి సిఫార్సు మేరకే వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Monday, December 13, 2010

క్యాన్సర్‌ గుట్టువిప్పే వేలిముద్ర

క్యాన్సర్‌ గుట్టువిప్పే వేలిముద్ర
క్యాన్సర్‌ ఉందా? ఉంటే ముదురుతోందా? లేక అలాగే ఉందా? ఇలా దాని ఆనవాళ్లను ఎప్పటికప్పుడు తెలియజెప్పే తేలికపాటి పరీక్ష ఏదైనా ఉంటేఎంత బాగుండును?
ది ఎప్పటి నుంచో పరిశోధకుల మెదళ్లకు పదును పెడుతున్న సమస్య. ఎందుకంటే క్యాన్సర్‌ ఏ దశలో ఉందన్నది దాని చికిత్సకు కూడా కీలకమైన అంశం. ఈ ప్రశ్నకు సమాధానంగా శాస్త్రవేత్తలు తాజాగా ఓ రక్తపరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ఏ రకం క్యాన్సర్‌ నైనా పట్టివ్వటమే కాదు, దాని స్థాయిని అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ చికిత్స తీసుకున్న ఆ క్యాన్సర్‌ తిరగబెడుతున్నా కూడా పసిగట్టటానికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
క్యాన్సర్‌ బారినపడిన వారిలో ఆ క్యాన్సర్‌ కణుతుల కణజాలంలోని జన్యువులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఈ పరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు. చాలా వరకు క్యాన్సర్‌ కణుతుల్లో పెద్ద మొత్తంలో జన్యు పదార్థం మార్పు చెంది ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన కణాలలో కనిపించదు. ఈ మార్పులే శాస్త్రవేత్తలకు కాన్సర్‌ కణాల ఆనవాళ్లను పట్టిచ్చే జన్యుపరమైన వేలిముద్రల్లా (ఫింగర్‌ ప్రింట్‌) ఉపయోగపడుతున్నాయి. ఆయా క్యాన్సర్లు రాల్చే కణాలు, డీఎన్‌ఏ కలవటం వల్ల క్యాన్సర్‌ బాధితుల రక్తంలో ఈ 'ఫింగర్‌ ప్రింట్‌' జన్యు సమాచారం చాలా ఎక్కువగా కనబడుతుంది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారిలో దీని మోతాదు పడిపోతుంది. ఇక కణితి పూర్తిగా తగ్గిపోతే ఇది కూడా మాయమవుతుంది. పేగుల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒకరికి శాస్త్రవేత్తలు జన్యు పరీక్షలు చేస్తున్నప్పుడు కణుతుల్లోని ఒక క్రోమోజోమ్‌ మరో క్రోమోజోమ్‌తో అతుక్కుపోయి కనిపించింది. కణుతుల జన్యు ఫింగర్‌ ప్రింట్‌లో ఇదే కీలకమైన మార్పు. అతడికి శస్త్రచికిత్స చేశాక ఈ ఫింగర్‌ప్రింట్‌ స్థాయి తగ్గిపోయింది. అయితే.. అతడి శరీరంలో క్యాన్సర్‌ ఇంకా మిగిలి ఉండటం వల్ల ఈ ఫింగర్‌ప్రింట్‌ స్థాయి కొన్నాళ్లకు తిరిగి పెరిగింది. అంటే క్యాన్సర్‌ మళ్లీ మొదలైన సంగతినీ రక్త పరీక్ష ద్వారా గుర్తించగలిగారన్న మాట. దీంతో పరిశోధకులు.. ఈ పరీక్షను మరింతగా అభివృద్ధిపరిచే పనిలో ఉన్నారు. చికిత్సకు క్యాన్సర్‌ కణుతులు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవటానికి, అవసరమైతే చికిత్సలో మార్పులు చేయటానికి కూడా మున్ముందు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.